రూ. 1,003 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. జూబ్లీహిల్స్, ఖానామెట్‌‌ ప్రాంతాల్లో కబ్జా

రూ. 1,003 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. జూబ్లీహిల్స్, ఖానామెట్‌‌ ప్రాంతాల్లో కబ్జా

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు : హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్, ఖానామెట్‌‌ ప్రాంతాల్లో కబ్జాకు గురైన రూ.1,003 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌‌లోని అపోలో హాస్పిటల్‌‌ ఔట్‌‌గేట్‌‌కు ఎదురుగా ఇండ్ల మ‌‌ధ్య సుమారు రెండు ఎకరాల మేర పార్క్‌‌ ఉంది. అక్కడ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్టల్ న‌‌డుపుతున్న ఓ వ్యక్తి.. 150 గ‌‌జాల మేర పార్క్‌‌ను ఆక్రమించాడు.

కాంపౌండ్‌‌ దాటి పార్కులోకి జరిగి పాత భవ‌‌నానికి ఆనుకుని మ‌‌రో నిర్మాణం చేప‌‌ట్టాడు. పార్క్‌‌ వైపు గేటు ఏర్పాటు చేసుకొని పార్క్‌‌ స్థలాన్ని వాడుకుంటున్నాడు. చుట్టుప‌‌క్కల ఉన్న వారు కబ్జాను గమనించి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క‌‌మిష‌‌న‌‌ర్‌‌ ఏవీ రంగ‌‌నాథ్‌‌ ఆదేశాలతో హైడ్రా, జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

పార్క్‌‌ స్థలాన్ని ఆక్రమించినట్లు నిర్ధారించుకొని బుధవారం మూడు అంతస్తుల భవనాన్ని తొలగించి, స్థలం చుట్టూ ఫెన్సింగ్‌‌ వేశారు. పార్క్‌‌ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. హైడ్రా కాపాడిన భూమి విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేశారు.

ఖానామెట్‌‌లో ఐదు ఎకరాలు...

హైటెక్స్ ఎగ్జిబిష‌‌న్‌‌ గ్రౌండ్స్‌‌కు సమీపంలోని ఖానామెట్‌‌లో ఆల్ ఇండియా వెల‌‌మ సంఘానికి ఐదు ఎక‌‌రాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్‌‌ వాల్‌‌తో ప్రహ‌‌రీ నిర్మిస్తున్నారు. అయితే కుల సంఘాల‌‌కు స్థలాలు కేటాయించ‌‌డంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌‌నుగా ఆ స్థలానికి వెనుక వైపు ఉన్న స్థానికులు మ‌‌ట్టి పోస్తూ క‌‌బ్జా చేస్తూ.. ప్రశ్నించిన వాచ్‌‌మన్‌‌పై దాడి చేస్తున్నారు.

దీంతో ఆ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని పరిశీలించిన హైడ్రా ఆఫీసర్లు ఐదు ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌‌ వేశారు. ఇక్కడ ఎకరం భూమి రూ.200 కోట్ల వరకు ఉంటుందని, మొత్తం కాపాడిన భూమి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేశారు.